బట్టతల రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!

నా వయసు 36. గత ఏడాదిగా నా జుత్తు రాలిపోతోంది. మార్కెట్లో దొరుకుతున్న పలు రకాల తైలాలు, టానిక్కులు వాడాను. కానీ, ఫలితమేమీ రాలేదు. ఎందుకంటే మా నాన్న గారికి బట్టతల ఉంది. ఇదేమైనా వారసత్వపు సమస్యా? అంతకు మించిన వేరే కారణాలు ఏమైనా ఉంటాయా? రోజురోజుకూ నా జుత్తు బాగా పలచబారుతోంది. ఈ సమస్యకు పరిష్కారం సూచించండి.
– బి. కృష్ణకుమార్‌, ఖాజీపేట

వారసత్వ మూలాలు అనేది ఇతర ప్రయత్నాలన్నీ చేశాక కూడా ఏ ప్రయోజనమూ కలగనప్పుడు మాత్రమే అనుకోవలసిన చివరి మాట. అంతకన్నా ముందు, జుత్తుపోషణకు అవసరమైన ప్రొటీన్‌, ఐరన్‌, క్యాల్షియం, జింక్‌, ఇతరమైన మరికొన్ని విటమిన్లు ఇవన్నీ అందుతున్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. ఆ రకమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని పూరించే ప్రయత్నం వెంటనే చేయాలి. వీటితో పాటు జీవన శైలిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి. ముఖ్యంగా నిద్ర సమయంలో ఎత్తైన దిండు పెట్టుకోవడం, ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం, 6 గంటల కన్నా తక్కువగా నిద్రించడం వంటివి మానుకోవాలి.

చాలా కాలంగా మలబద్దకం కొనసాగుతూ ఉంటే ఆహారంలో పీచుపదార్థాల మోతాదు పెంచుకుని ఆ సమస్యను అధిగమించాలి. అంతే తప్ప ప్రతి సమస్యనూ వారసత్వ మూలాలకే ఆపాదించడం కూడా సరికాదు. ఎందుకంటే, పోషకాలు తీసుకునే విషయంలో తండ్రి నిర్లక్ష్యం చేయడం వల్ల అతని జుత్తు రాలిపోయి ఉండవచ్చు. అలా ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయని కొడుకుకు ఆ సమస్య ఎలా వస్తుంది.? . వారసత్వ మూలాలు అసలే ఉండవని కాదు గానీ, ప్రతి లోపాన్ని ఆ మిషతో తప్పించుకోవడమైతే ఎంత మాత్రం సరికాదు.

Comments

comments

Comments are closed.